అమెరికా మార్కెట్లలో నమోదైన పలు భారతీయ కంపెనీల షేర్లు ఒక నవంబర్ నెలలోనే 3 బిలియన్ డాలర్ల మేరకు విలువను కోల్పోయాయని సమాచారం. వీటిలో భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మాత్రమే 1.73 బిలియన్ డాలర్లను కోల్పోయిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
గత నెల పొడవునా ఎగుడు దిగుడులను చవిచూసిన 16 భారతీయ కంపెనీల షేర్లు దాదాపు 2.91 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయాయి. ఇన్ఫోసిస్‌తో పాటుగా న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్, నాస్డాక్‌లలో నమోదైన సత్యం కంప్యూటర్ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి 15 భారతీయ కంపెనీలు 284 మిలియన్ డాలర్లను అమాంతంగా కోల్పోయాయి.
సత్యం కంప్యూటర్స్ సంస్థ మార్కెట్ విలువలో 832 మిలియన్ డాలర్లు హరించుకు పోగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 485 మిలియన్ డాలర్లను, ఐసీఐసీఐ బ్యాంక్ 284 మిలియన్ డాలర్లను కోల్పోయాయి. భారతీయ ఔట్‌సోర్సింగ్ సంస్థ జెన్‌పాక్ట్ 285 మిలియన్ డాలర్లను, టాటాకామ్, టాటా మోటార్స్ వరుసగా 2.74, 2.29 బిలియన్ డాలర్ల మార్కెట్ కేపిటలైజేషన్‌ను కోల్పోయాయి. అమెరికా ప్రభుత్వం దివాళా అంచున ఉన్న సంస్థలకోసం 800 బిలియన్ డాలర్ల సహాయ పథకాన్ని ప్రకటించగా, చైనా తన వడ్డీరేట్లను తగ్గించుకుంది. ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకున్నప్పటికీ అమెరికాలో నమోదైన భారతీయ కంపెనీల మార్కెట్ విలువ పడిపోవడం గమనార్హం. |