దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక మాంద్య ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రెండో ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా భారతీయ పరిశ్రమ విదేశాలనుంచి మరింతగా రుణ పొందడానికి, విదేశీ సంస్థాగత పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి వీలవుతుందని, ప్రభుత్వ వ్యయాన్ని కూడా దీంతో పెంచవచ్చునని భావిస్తున్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో సహాయ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా పారిశ్రామిక రంగానికి 20 వేల కోట్ల రూపాయల మేరకు లబ్ది చేకూరనుంది. ఈ మేరకు తన ఆదాయాన్ని కేంద్రం తగ్గించుకోవడానికి సిద్ధ పడింది. మరోవైపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీరేట్లను తగ్గించుకుంది. రెపోరేటు, రివర్స్ రెపో రేటు చెరో వంద బేసిస్ పాయంట్లను -1 శాతం- తగ్గించి, 4 శాతంగా కేంద్ర బ్యాంకు నిర్ణయించింది. అలాగే దేశంలో నగదు నిల్వల నిష్పత్తిని -సిఆర్ఆర్- 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5 శాతంగా నిర్ణయించింది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా 20 వేల కోట్ల రూపాయలు వస్తాయి. కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా శుక్రవారం ఈ చివరి ప్యాకేజీని ప్రకటించారు. మౌలికరంగం, గృహ నిర్మాణం, ఆటోమొబైల్స్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ రుణవితరణను పెంచుకోవాలని కేంద్రం సూచించింది. ఇటీవలి వరకు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వృద్ధి రేటును పెంచే నిర్ణయాలు తీసుకోవడం విశేషం. |