ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలా... అని చాలా మంది ఆలోచనలో పడుతున్నారు. అలాంటి వారు ఎటువంటి భయం లేకుండా గుజరాత్ ఆధారిత పరిశ్రమలు, ఇతర సంస్థలలో ధైర్యంగా పెట్టుబడి పెట్టవచ్చని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సెలవిస్తున్నారు.
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2009 పేరిట ఒక సమావేశాన్ని జనవరి 11- 12 తేదీలలో ఏర్పాటు చేస్తున్నారు. తమ రాష్ట్రంలో జపాన్ దేశానికి చెందిన పలు కంపెనీలు పెట్టుబడి పెట్టాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
పొరుగు రాష్ట్రాలలోని పలు కంపెనీలు సైతం గుజరాత్ వైపు ఆకర్షితమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసిన పలు రాష్ట్రాలు తమను అనుసరిస్తున్నాయన్నారు. |