నిధుల కుంభకోణంలో చిక్కుకున్న సత్యం కంప్యూటర్స్ వాటాను విక్రయించేందుకు ఈవారంలోనే బిడ్‌లను ఆహ్వానించనున్నారు. తదనుగుణంగానే సత్యం బోర్డు ఈ వారంలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ కోసం బిడ్లను ఆహ్వానించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఈ ప్రక్రియనంతా నెలరోజుల్లోనే పూర్తి చేయనుందని కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా శుక్రవారం నాడు బోర్డు హైదరాబాద్‌లో మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎల్ అండ్ టి, స్పైస్ గ్రూప్, హిందూజాలు సత్యంను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు 51 శాతం వాటా విక్రయించటానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబి ఇటీవలె అనుమతినిచ్చింది. సత్యం కంప్యూటర్స్‌లో ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా 31 శాతం వాటాలను తీసుకున్న ఇన్వెస్టర్ మరో 20 శాతాన్ని ఓపెన్ ఆఫర్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని సెబి పేర్కొంది. |