అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావం నుంచి మిగిలిన ప్రపంచ దేశాల కంటే భారత్ వేగంగా కోలుకుంటుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్ డి.సుబ్బారావు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సంక్షోభం నుంచి ఎప్పుడు బయటపడతామనేందుకు నిర్దిష్ట సమయం చెప్పడం కష్టమన్నారు.
జి- 20 సమావేశంలో పాల్గొనేందుకు ప్రస్తుతం లండన్‌లో ఉన్న సుబ్బారావు బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాలు వెల్లడించారు. ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడటంలో భారత్ ముఖ్యభూమిక పోషించగలదన్నారు.
భారత్ అభివృద్ధి యంత్రం కాగలదన్నారు. సంక్షోభం నుంచి ప్రపంచం కంటే ముందుగా భారత్ కోలుకోవడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభం అయితే, ఆపై భారత్ వృద్ధి వేగంగా ఉంటుందని సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం భారత ఆర్థిక, తయారీ రంగాలపై పడిందన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు పుంజుకుంటుందనేది చెప్పడం కష్టమని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రభావవంతంగా, సురక్షితంగా ఉందని చెప్పారు. |