కోల్‌కతా-లండన్ మధ్య విమాన సర్వీసును పునరుద్ధరించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల మధ్య ఆదివారం నుంచి విమాన సర్వీసు నడుస్తుంది. ఇప్పటి వరకు ఈ రెండు ప్రాంతాల మధ్య బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థ ఒక విమాన సర్వీసును నడుపుతూ వచ్చింది. అయితే, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం, ఈ మార్గంలో పెద్దగా లాభాలు లేకపోవడం వల్ల ఆ సంస్థ సర్వీసును నిలిపివేస్తున్నట్టు శనివారం ప్రకటించింది.
ఆ మరుక్షణంపై ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. గత 2008 సంవత్సరం నుంచి ఈ మార్గంలో విమాన సర్వీసును ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇకపై నుంచి కోల్‌కతా-లండన్‌కు ఢిల్లీ మీదుగా వారంలో అన్ని రోజుల్లో విమాన సేవలను అందిస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
కోల్‌కతాలోని ఎన్.ఎస్.సి బోస్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఉదయం 10.30 నిమిషాలకు ఎయిర్ బస్-319 122 మంది ప్రయాణికులతో బయలుదేరి ఢిల్లీకి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చేరుకుంటుంది. ఢిల్లీ నుంచి బోయింగ్ 777-200 ఈకే విమానం 280 ప్రయాణికులతో లండన్‌కు చేరుకుంటుందని ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. అయితే, బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం కోల్‌కతా నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులను నడుపుతూ వచ్చింది. |