చైనా ఆటోమొబైల్ రంగ దిగ్గజం ఫస్ట్ ఆటోమొబైల్ వర్క్ (ఎఫ్ఏడబ్ల్యూ) ప్రతినిధులు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్యతో సమావేశమయ్యారు. బెంగాల్ రాష్ట్రంలోని ఆటోమొబైల్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుపై సాధ్యా సాధ్యాలను చర్చించారు. దీనిపై బెంగాల్ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి సబియాచ్చి సేన్ మాట్లాడుతూ ఎఫ్‌ఏడబ్ల్యూకు చెందిన ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చారు.
హల్దియాను సందర్శించి, భారత్ భాగస్వాములపై ఆరా తీశారు. ఇక్కడ పరిస్థితులపై అధ్యయనం చేసిన తర్వాత వారు తగిన ప్రతిపాదనలు ఇస్తారని సేన్ తెలిపారు. ఎఫ్‌ఏడబ్ల్యూ ఇప్పటికే యూరల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్ కోసం సుమారు ఆరు వందల ఎకరాల కోసం చూస్తున్నారు.
కాగా, సింగూర్‌లో టాటా గ్రూపునకు చెందిన నానో కార్ల ప్రాజెక్టుకు వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెల్సిందే. దీనిపై కూడా చైనా ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. దీనిపై యూరల్ ఇండియా ఛైర్మన్ జేకె.సరఫ్ మాట్లాడుతూ చైనా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. చైనా సంస్థకు చెందిన చిన్న కార్ల విభాగం ప్రతినిధి బృందం వచ్చే వారంలో ఇక్కడకు వస్తుందని చెప్పారు. |