ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకించి ఎగుమతి విభాగంలో సుమారు 1.3 మిలియన్‌లకు పైగా ఉద్యోగాలకు గండి పడే అవకాశం ఉందని ప్రముఖ సంస్థ యూఎన్‌సీటీఏడీ వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక సంక్షోభమే దీనికి కారణంగా యూఎన్‌సీటీఏడీ వివరించింది. యూఎన్‌సీటీఏడీ అధ్యయనం ప్రకారం.. 2009-10 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం భారత ఎగుమతులు మొత్తం 2.2 శాతం మేరకు క్షీణించాయి. దీంతో ఎగుమతుల రంగంలో 7.48 లక్షల ఉద్యోగాలకు కోత పడనున్నట్లు తెలుస్తోంది. పసిడి, వజ్రం, ఖనిజ లవణాలు, వస్త్రాలు మరియు దాని ఉత్పత్తులు తదితర రంగాలను అనుకరిస్తూ పెట్రోలియం ఉత్పత్తుల్లోను ఎగుమతులు గరిష్ఠంగా క్షీణించే అవకాశం ఉందని యూఎన్‌సీటీఏడీ తెలిపింది.అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిస్థితిలో మార్పు రావచ్చని.. ఎగుమతుల రంగంలో కొత్త కొలువులకు అవకాశం ఉందని వివరించింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 5.22 మిలియన్ మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవచ్చని వివరించింది. అలాగే ఇదే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో కోత ఉండకపోవచ్చని.. సానుకూల వృద్ధి కనబడుతుందని యూఎన్‌సీటీఏడీ వివరించింది. అదలా ఉంచితే.. ఆర్థిక సంక్షోభం కారణంగా 2008-09 ఆర్థిక సంవత్సరంలో వస్త్రపరిశ్రమ వంటి రంగాలు బలహీనంగా ఉండటం వల్ల 1.16 మిలియన్‌ల మంది ఉద్యోగాలను కోల్పోయారని యూఎన్‌సీటీఏడీ విశ్లేషించింది. |