అంతర్జాతీయంగా ఐటీ రంగంలో పోటీ బాగా పెరిగిన ప్రస్తుత తరుణంలో దేశీయ కంపెనీలు ఐటీ సేవల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఐటీ సేవలను తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని చెప్పుకోవడం తనకు ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
బెంగుళూరులో సీఐఐ ఏర్పాటు చేసిన ఐదో ఇన్నోవేషన్ సమిట్ 2009 సమావేశంలో ప్రేమ్‌జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ సేవలకు సంబంధించి భారత్‌కు క్రమంగా పోటీ పెరుగుతోందన్నారు. ఒకప్పుడు భారత బీపీఓ ఎగుమతుల్లో 10శాతం కూడా ఉండని ఫిలిప్పీన్స్ ప్రస్తుతం దాదాపు భారత స్థాయి ఎగుమతులను అందిస్తోందని అన్నారు.
ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు ఐటీ సేవలకు సంబంధించి భారత్‌కు ఉన్న పోటీని అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అదేసమయంలో దేశంలో కొత్తగా ఐటీ ఇంజినీరింగ్ పూర్తిచేసి బయటకు వచ్చినవారి భవిష్యత్ మరీఅంత అందంగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఐటీ విద్య పూర్తిచేసిన వారిలో దాదాపు 80శాతం మంది నిరుద్యోగులుగా ఉండిపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. |