అమెరికా కార్పొరేట్ జెట్ విమాన తయారీ సంస్థ సెస్నా ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ తాజాగా మళ్లీ 1,300 మంది ఉద్యోగులను తొలిగించనుంది. ఆర్థిక మాంద్యం మరింతగా విస్తరిస్తున్న ఈ నేపథ్యంలో ఉత్పత్తి విభాగంలో ఈ సవరణలు (ఉద్యోగాల్లో కోత) చేసినట్లు కంపెనీ తెలిపింది.
సెస్నా సంస్థ ప్రతినిధి డగ్ ఒలివర్ విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది నవంబర్ నుండి ఏప్రిల్ 29 వరకు 6,900 మంది ఉద్యోగులను తొలిగించినట్లు తెలిపారు. తాజాగా మరో 1,300 మందిని తొలగిస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తులను కుదించిన కారణంగా ఉద్యోగులను కూడా తగ్గించాలని కంపెనీ నిర్ణయించిందన్నారు.
2009లో సమారు 535 విమానాలను తయారు చేయాలని ఒక ఏడాది క్రితం ప్రణాళిక చేశామన్నారు. అయితే ఆర్థిక సంక్షోభంతో ఆ సంఖ్యను ప్రస్తుతం కుదించామన్నారు. 270 నుండి 300 వరకు విమానాలను సిద్ధం చేయనున్నామన్నారు. కాగా, రానున్న రెండు వారాల్లో 800 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేస్తున్నామని ఓలివర్ తెలిపారు.
ఖర్చుల తగ్గింపు మరియు పొదుపు అంచనాలను చేస్తున్నట్లు మాత్రం ఓలివర్ సూచనప్రాయంగా కూడా వెల్లడించలేదు. అదలా ఉంచితే.. ఉద్యోగాల్లో కోత విధించిన కారణంగా రానున్న రోజుల్లో 40 మిలియన్ డాలర్ల నుండి 75 మిలియన్ డాలర్ల వరకు కంపెనీ ఆదాయం పెరిగే అవకాశం ఉందని సెస్నా అనుబంధ సంస్థ రోడ్ ఐలాండ్‌కు చెందిన టెక్స్‌ట్రాన్ తెలిపింది. |