ఎగుమతుల రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరం గడ్డుకాలం తప్పదని అంక్టాడ్ అనే సర్వే తేల్చిచెబుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికమాంద్యం హెచ్చుమీరుతున్న కారణంగా ఎగుమతులు తగ్గి ఈ రంగంలోని 13లక్షలమంది ఉపాధి కోల్పోవచ్చని ఈ సర్వే పేర్కొంది.
ఈ సర్వే ప్రకారం 2009-10లో భారత ఎగుమతులు 2.2 శాతం మేర క్షీణించే అవకాశముంది. ఈ కారణంగా ఒక జౌళి రంగంలోనే 2008-09లో 11.6 లక్షలమంది ఉపాధి కోల్పోయినట్టు సర్వే తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు భారీగా క్షీణించే అవకాశముందని సర్వే పేర్కొంది. అలాగే రత్నాభరణాలు, ఖనిజాలు, జౌళి ఉత్పత్తుల ఎగుమతులు సైతం భారీగా తగ్గుతాయని సర్వే తెలిపింది.
అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం ఈ పరిస్థితి మెరుగుపడుతుందని సర్వే పేర్కొంది. తద్వారా ఈ రంగంలో కొత్తవారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని సర్వే తెలిపింది. |