సత్యం కంప్యూటర్స్ సంస్థ పేరు మారింది. ఇకపై సత్యం సంస్థ పేరు 'మహీంద్రా సత్యం' పేరుతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రస్తుత ఏడాది జనవరి నెలలో కుంభకోణంలో కూరుకుపోయిన సత్యం కంప్యూటర్స్ సంస్థను టెక్ మహీంద్రా కొనుగోలు చేసిన విషయం విదితమే. టెక్ మహీంద్ర అధికారులు, సత్యం అధికారులతో శని, ఆదివారాలలో హైదరాబాదులో సమావేశమై కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించారు. మహీంద్ర గ్రూప్‌లోని కార్పొరేట్ గవర్నెన్స్ విలువలు, సత్యం కంపెనీకి గల సాఫ్ట్‌వేర్ నేపుణ్యాల మేళవింపుతో కూడిన శక్తిసామర్ధ్యాలను వ్యక్తం చేస్తున్నట్లు అర్ధం వచ్చే విధంగా 'మహీంద్ర...సత్యం' అని పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల అభిరుచి, ప్రాధాన్యత, అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్‌లు మహీంద్ర గూపు ప్రత్యేకతని మహీంద్ర గ్రూప్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్‌మహీంద్ర ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సరికొత్త బ్రాండ్‌తో కొత్త రూపు తీసుకువచ్చిన సందర్భంగా కార్పోరెట్ గవర్నెన్స్, ప్రొఫెషనలిజం, కస్టమర్ ఫస్ట్, క్వాలిటీ, వ్యక్తిగత ప్రాధాన్యాలను ప్రమాణాలుగా నిర్దేశించుకున్నారు. వాటిని ఆచరించేందుకు నిర్ణియించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా సత్యం మరో రెండు సంవత్సరాలలో కనుమరుగు కానుంది. మహీంద్రా సత్యం బ్రాండ్ చాలా స్పష్టంగా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ బ్రాండ్ ఖాతాదారుల్లో మరింత విశ్వాసం, ఉద్యోగుల్లో తమ సంస్థ పట్ల మరింత అంకిత భావాన్ని కలిగించనుందని, రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందానికి గుర్తింపుతోపాటు ఆయా సంస్థల లక్షణాలను ప్రతిబింబిస్తుందని బ్రాండ్ కన్సల్టెంట్ తెల్లా రాజ్‌మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. |