రైల్వే మంత్రిణి మమతా బెనర్జీ తనశాఖాధికారుల విదేశీయాత్రలకు బ్రేక్ వేశారు. అతి ముఖ్యమైన విదేశీయాత్రలు తప్పితే, ఇతర ఉద్దేశాలకు సంబంధించిన విదేశీ యాత్రలకు తాము నిషేధం విధించినట్లు రైల్వేశాఖామంత్రి మమతా బెనర్జీ తెలిపారు. కోలకతాలో ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ... తమశాఖాధికారలు ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలకొరకు విదేశాలకు వెళ్ళేందుకు తాము అనుమతినిచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇలా మిగిలే ఖర్చును రైల్లో ప్రయాణించే యాత్రికుల సంరక్షణార్థం, వారికి మరింత మెరుగైన సేవలను అందించేందుకు వినియోగిస్తామని ఆమె తెలిపారు. ప్రస్తుతం రైలు ప్రయాణ పట్టికను సరళీకృతం చేయడం తమ ముందున్న కర్తవ్యమని, దీంతోపాటు దేశంలోని ప్రతి రైలు సమయానుసారం నడిచేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఇందులో 85శాతం అభివృద్ధిని సాధించగలనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. |