ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంతోపాటు గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటు చేయనున్న రెండు ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్‌లను మూడు నెలల్లో ప్రారంభించనున్నారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ 100 రోజుల్లో అనుసరించే కార్యక్రమాలను ఆ శాఖ మంత్రి దయానిధి మారన్ బుధవారంనాడు న్యూఢిల్లీలో విడుదల చేశారు. జౌళి రంగంలో మౌళిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఒక్కొక్కటి ఐదు వందలనుంచి వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రెండు పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రెండు పార్క్‌లను ఏర్పాటు చేసేందుకు తక్షణమే నలభై కోట్ల రూపాయల వంతున నిధులు కేటాయిస్తున్నట్లు మారన్ పేర్కొన్నారు. ఇదిలావుండగా రానున్న 100 రోజుల ప్రణాళికలో రెండు టెక్స్‌టైల్ పార్కులతో పాటు అదనంగా 15 పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలను పరిశీస్తున్నట్టు ఆయన తెలిపారు. రానున్న వంద రోజుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కు కాటన్ కనీస మద్దతు ధర బాధ్యతలు నెరవేర్చేందుకు అదనంగా రూ.1,660 కోట్లు కేటాయింపు సాధించేందుకు మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుంది. వచ్చే వంద రోజుల్లో మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ను ప్రధాన కార్యక్రమాలు, పథకాలు పొందుపరచి రూపొందిస్తుంది. కాగా నేషనల్ ఫైబర్ పాలసీ రూపొందించేందుకు త్వరలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని, లక్షమంది చేనేత కార్మికులకు ఆరోగ్యబీమా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆధునికీకరించిన ఏడు ఎన్‌టీసీ మిల్లుల పున: ప్రారంభం, టియుఎఫ్ కవరేజ్ మరింత విస్తరణ, ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ ద్వారా హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాల కల్పన, జనపనారలతో చేసిన బ్యాగ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడం, చేనేత, హస్తకళా ఉత్పత్తులకు ఈ-మార్కెటింగ్ అవకాశాల కల్పనకు రానున్న వంద రోజుల ప్రణాళికలోని ఇతర అంశాలని ఆయన వివరించారు. |