దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం కొత్త కారు రుణాల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద కొత్త కార్లకు అందజేసే రుణాలపై తొలి ఏడాది ఎనిమిది శాతం, రెండు, మూడు సంవత్సరాల్లో పది శాతం వడ్డీ వసూలు చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది.
కొత్తగా ప్రవేశపెట్టిన కార్ల రుణ పథకానికి "ఎస్‌బీఐ ఈజీ కార్ లోన్ స్కీమ్" అనే పేరు పెట్టారు. జులై 1 నుంచి ఈ కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కొత్త పథకంలో కార్ల రుణాలపై తొలి ఏడాది వార్షిక వడ్డీ రేటు 8 శాతం, రెండు, మూడు సంవత్సరాలకు 10 శాతం వడ్డీ రేటు విధించాలని నిర్ణయించారు. బ్యాంకు ప్రామాణిక ప్రధాన వడ్డీ రేటు (బీపీఎల్ఆర్) కంటే కొత్త పథకం కింద కార్ల రుణాలపై వడ్డీ రేటు 0.25-0.75 శాతం మేర తగ్గించింది. |