దేశంలో అతిపెద్ద గాలిమరల తయారీ సంస్థ సుజ్లోన్ ఎనర్జీ ఆదివారం గత ఆర్థిక సంవత్సర ఫలితాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికరలాభంలో 77 శాతం క్షీణత నమోదయింది. 09 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికరలాభం రూ.236.48 కోట్లకే పరిమితమైందని సుజ్లోన్ ఎనర్జీ ఓ ప్రకటనలో తెలిపింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1,030.10 శాతం నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది అమెరికాకు చెందిన కొన్ని కంపెనీలు ఆర్డర్లు రద్దు చేసుకోవడం ఆదాయంపై ప్రభావం చూపిందని సుజ్లోన్ వెల్లడించింది.
అంతేకాకుండా విఫలమైన బ్లేడ్లను తిరిగి సరఫరా చేసే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా ఆదాయాన్ని ప్రభావితం చేసిందని తెలిపింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. ఈ ప్రక్రియ ఆగస్టునాటికి పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది. దీని కోసం కంపెనీ ఈ ఏడాది జనవరి- మార్చి మధ్యకాలంలో రూ.100 కోట్ల ఖర్చు చేసింది. |