ప్రభుత్వ రంగ పౌర విమానయాన సంస్థ ఎయిట్ ఇండియా యాజమాన్యంతో కంపెనీ యూనియన్లు చర్చలు కొనసాగిస్తున్నాయి. వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం ఎయిర్ ఇండియా (ఏఐ) సిబ్బంది విధులు బహిష్కరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఎయిర్ ఇండియా సీఎండీ అరవింద్ జాధవ్‌తో ప్రధాన యూనియన్లు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపాయి. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఎయిర్ ఇండియా యాజమాన్య ఇతర ప్రతినిధులతోనూ ఉద్యోగ సంఘాలు గత కొన్ని వారాలుగా చర్చలు కొనసాగిస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభం బారినపడి తీవ్రంగా నష్టపోతున్న ఎయిర్ ఇండియాలో నిధుల నిల్వలు పెంచేందుకు, నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు ఈ చర్చల సందర్భంగా యజమాన్యానికి సలహాలు ఇస్తున్నారు. యూనియన్లు ఇచ్చిన సలహాల్లో ఉద్యోగులకు వేతన చెల్లింపు ఉండని సెలవులు ప్రకటించాలనే ప్రతిపాదన ఒకటి. దీనికి యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సంస్థలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి యాజమాన్యం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ నష్టాలకు ఉద్యోగులను బలిపశువులను చేయరాదని డిమాండ్ చేస్తున్నారు. |