జులై నెలలో సిమెంట్ ధరలు తగ్గనున్నాయి. సిమెంటు బస్తా ప్రతి 50కిలోలపై దాదాపు రూ. 3 నుంచి రూ. 5ల వరకు తగ్గనుంది.
సిమెంట్ పరిశ్రమ వర్గాల కథనం మేరకు అవసరాలకు మించి ఉత్పత్తులు జరిగిన కారణంగా ధరలలో తగ్గుదల కనపడే సూచనలున్నాయి. ధరల్లో తగ్గుదల ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోను, అలాగే ముంబై, గుజరాత్ రాష్ట్రాలలో సిమెంట్ ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో అక్కడ ప్రతి బస్తాకు రూ. 255లుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
అదే ఉత్తర, తూర్పు భారతదేశంలోని రాష్ట్రాలలో సిమెంట్ ధర రూ. 245లుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
జూన్ నెలలో సిమెంట్ వాడకం తక్కువగా ఉండింది. దీంతోపాటు ఉత్పత్తులుకూడా ఎక్కువగానే ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తనున్నట్లు సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఎమ్ఏ) అధ్యక్షుడు, శ్రీ సిమెంట్‌కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.ఎమ్. బాంగడ్ తెలిపారు.
ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ ధరలు బాగానే ఉన్నాయని, అయితే ఇంకా ప్రతి బస్తాపై రూ. 3 నుంచి రూ. 5ల వరకు తగ్గే సూచనులున్నట్లు అంబుజా సిమెంట్ ప్రతినిధి అజయ్ కపూర్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లో సిమెంట్ ధరలు తగ్గాయని, ఇది రానున్న రెండు నెలల్లో మరింత తగ్గే అవకాశాలున్నట్లు సిమెంట్ స్టాకిస్ట్ అండ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ లాడీవాలా తెలిపారు. |