తమ దేశంనుంచి భారతదేశంలోకి వచ్చే పాల ఉత్పత్తులపై నిషేధాన్ని ఎత్తివేయకుంటే తాము భారతదేశానికి చెందిన ఉత్పత్తులనుకూడా తమ దేశంలో నిషేధం విధిస్తామని చైనా భారతదేశాన్ని హెచ్చరించింది.
చైనా దేశంలో ఉత్పత్తి అయ్యే పాలపొడి కల్తీమూలంగా ఆ దేశంలో వేలాదిమంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో భారతదేశంతోపాటు పలు దేశాలుకూడా చైనా పాల ఉత్పత్తులపై నిషేధం విధించాయి.
తదనంతరం కొన్ని దేశాలు మాత్రం ఆ నిషేధాన్ని సడలించి చైనా పాల ఉత్పత్తులను వాడటం ప్రారంభించాయి. కాని భారతదేశం మాత్రం మరో ఆరు నెలలపాటు నిషేధాన్ని పొడిగించింది.
దీంతో చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చైనా నాణ్యతా పర్యవేక్షణా విభాగం భారతీయ రాయబార కార్యాలయానికి ఓ లేఖ రాసింది. అందులో తమ దేశంలో కల్తీపాలపొడి సంక్షోభానంతరం నష్ట నివారణకు తాము అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది.
తాము తీసుకున్న చర్యలతో పలు దేశాలు నిషేధాన్ని ఎత్తివేయగా భారతదేశం మాత్రం కొనసాగించటం అన్యాయమని, అసలే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత తరుణంలో తమకు ఇది మరింత ఇబ్బందికరంగా మారిందని ఆ లేఖలో పేర్కొంది.
ఇదిలావుండగా భారతదేశం తమ వైఖరిని మార్చుకోకపోతే తాముకూడా ఆ దేశంనుంచి వచ్చే ఇతర ఉత్పత్తులను నిషేధిస్తామని ఆ లేఖలో తెలిపింది. |