ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన ఆరు షిప్పింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.3300 కోట్ల నిధులు అందజేయనుంది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈ నిధులతో ఆరు షిప్పింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ బుధవారం వెల్లడించింది.
వంద రోజుల ప్రణాళికలో భాగంగా 31.23 మిలియన్ టన్నులు, 1.97 మిలియన్ టీఈయూల సామర్థ్యం గల ఆరు షిప్పింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు.
ఈ నిధులతో పారాదీప్ పోర్టులో 10 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఐరన్ ఓర్ బెర్తు, కోల్ బెర్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు. వీరికి వరుసగా రూ.591.35కోట్లు, రూ.479.01 కోట్ల నిధులు కేటాయించారు. 4.7 లక్షల టీఈయుల సామర్థ్యం గల ఎనిమిది బెర్తుల టెర్మినల్స్‌ను తమిళనాడులోని ట్యుటికోరిన్ పోర్టులో ఏర్పాటు చేస్తారు. దీనికి రూ.312.23 కోట్ల నిధులు కేటాయించబడ్డాయి.
4.61 టన్నుల సామర్థ్యం గల కోల్ టెర్మినల్‌ను రూ.252.44 కోట్లతో గోవాలోని ముర్మిగావ్ పోర్టులో ఏర్పాటు చేస్తారు. కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టులో షిప్పింగ్ ప్రాజెక్టును రూ.277.11 కోట్లతో, తమిళనాడులోని ఎన్నూర్ పోర్టులో రూ.1407 కోట్లతో మరొక షిప్పింగ్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు నౌకాయాన శాఖ తెలిపింది. |