ఖాతాల కుంభకోణంతో సంక్షోభంలో చిక్కుకొని కొత్త యాజమాన్యం కిందకు వెళ్లిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ (కొత్త పేరు మహీంద్రా సత్యం) బోర్డులోని ఆరుగురు డైరెక్టర్లను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీ లా బోర్డు (సీఎల్‌బీ)ని కోరినట్లు సమాచారం. సత్యం కంప్యూటర్స్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆ కంపెనీ బోర్డులో ప్రభుత్వం డైరెక్టర్లను నియమించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మహీంద్రా సత్యంగా అవతరించిన కంపెనీ బోర్డులోనూ ఈ డైరెక్టర్లు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు డైరెక్టర్లను వెనక్కు పిలిపించాలని కంపెనీ లా బోర్డును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఉన్నతవర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో తాము నియమించిన ఆరుగురు డైరెక్టర్లను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం కంపెనీ లా బోర్డుకు దరఖాస్తు చేసింది. |