దేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టాటా మోటార్స్ సంస్థ యూరోప్‌లో తొలిసారిగా నానో కారుతో రంగప్రవేశం చేయనుంది. టాటా మోటార్స్ సంస్థకు చెందిన అతి బుల్లికారు నానోను రానున్న 18నెలల్లో యూరోప్‌లో ప్రవేశపెట్టనున్నట్లు టాటా సంస్థకు చెందిన నైజీరియా ప్రతినిధి సుదీప్ రే తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి తక్కువధరకు లభించే కారుగా ప్రపంచదేశాలు నానోను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. నానో కారును టాటా సంస్థ నైజీరియాకు 3,57,480ఎన్‌జీఎన్(భారత కరెన్సీ ప్రకారం రూ. 1.16లక్షలు)ధరకు అమ్ముతుందని, ఇక్కడ అమ్మే పాత మోడల్ కార్ల ధరకన్నాకూడా తక్కువేనని ఆయన అన్నారు. ఇదిలావుండగా నానోకారును మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత నైజీరియావాసులకు ఎంతో లాభదాయకమని, ఎందుకంటే అక్కడ మెట్రోలాంటి వాహన నిర్మాణాల ప్రణాళికలేవీ లేవని ఆయన తెలిపారు. కాగా అతి తక్కువధరకు అందించే నానోకారును ఇక్కడ అసెంబల్డ్ చేసి అమ్ముతారా లేక విడిభాగాలను తీసుకువెళ్ళి అక్కడ అసెంబల్డ్ చేసి అమ్ముతారా అనే విషయం ఆయన స్పష్టం చేయలేదు. |