2009-10 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్‌ను కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై పలు రాష్ట్రాలు గంపెడు ఆశలు పెట్టుకుని ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా కొత్త బడ్జెట్లో కేటాయింపులు చోటు చేసుకుంటాయని ఆశిస్తున్నాయి.
సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రతుల చిట్టా విప్పుతారు. బడ్జెట్‌ను దాఖలు చేయడంలో ప్రత్యేక అనుభవం గడించిన ఈ రాజకీయ కురువృద్ధుడు.. తాజా బడ్జెట్‌ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసి ఉంటారని ఆర్థిక నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
గత ఫిబ్రవరి ఆఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రణబ్.. ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సంస్కరణల యుగంలో ప్రణబ్ ఎలా బడ్జెట్‌ను రూపొందించారన్నదే ప్రస్తుతం అందరిని ఆలోచింపజేస్తున్న ప్రధాన అంశం.
ముఖ్యంగా, వచ్చే బడ్జెట్ ప్రజారంజకంగా ఉంటుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఇప్పటికే దేశ ప్రజలకు భరోసా ఇచ్చిన విషయం తెల్సిందే. మొత్తం మీద ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్‌పై దేశ ప్రజలతో పాటు.. పారిశ్రామికరంగం గంపెడు ఆశలు పెట్టుకుంది. |