ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో మళ్లీ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల వేతనాల్లో ఉత్పత్తి అనుంబధిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ)ను 50 శాతం మేరకు కుదించాలన్న ఎయిర్ ఇండియా (ఏఐ)... ప్రతిపాదన తీసుకువచ్చి విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. ఏఐ చేసిన పీఎల్ఐ కుదింపు ప్రతిపాదనను నిరాకరిస్తూ.. ఆ సంస్థ పైలట్లు మళ్లీ సమ్మెకు దిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏఐ ఎగ్జిక్యూటివ్ పైలెట్లలోని ఓ విభాగం.. పీఎల్ఐ కుదింపును వ్యతిరేకిస్తూ.. నిన్న అర్థరాత్రి సమ్మె చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది.
ముంబైలో ఎగ్జిక్యూటివ్ పైలెట్ల కెప్టెన్ భల్లా మాట్లాడుతూ, వేతనాల్లో కోతను విధించడాన్ని ఎవరూ అంగీకరించలేకపోతున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయమై సమ్మె చేపట్టేందుకు ఎగ్జిక్యూటివ్ పైలెట్లు నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు.
తమ పని ఆపేయడం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. అయితే ప్రస్తుతం ఎంత మంది ఎగ్జిక్యూటివ్ పైలెట్లు మూకుమ్మడి సెలవులను తీసుకుంటున్నారో కెప్టెన్ భల్లా వెల్లడించలేదు. కానీ, మరోవైపు.. ఏఐ ప్రతినిధి జితేంద్ర భార్గవ మాట్లాడుతూ, పైలెట్ల సమ్మెకు దిగుతున్నట్లు తమకెలాంటి సమాచారం లేదన్నారు.
ఒకవేళ పైలెట్లు సమ్మె చేయాలని నిర్ణయిస్తే.. ఏ మేరకు విమానయాన కార్యకలాపాలపై ప్రభావం చూపనుందో చెప్పడం ఇప్పుడే సాధ్యపడదన్నారు. కాగా, ఏఐలో సుమారు 300 మంది ఎగ్జిక్యూటివ్ పైలెట్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా వరకు పరిపాలన విభాగంలోను భాగమై ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఎగ్జిక్యూటివ్ పైలెట్ల విభాగం ఏ యూనియన్‌ను ఏర్పాటు చేసుకోలేదని.. అలాగే వారు సమ్మెను చేయడం లేదని మరో అధికార వర్గాలు తెలిపాయి.