దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరలను నిర్ణయించడంలో తమకు స్వేచ్ఛ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అదే విధంగా కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో మరింత స్వతంత్రప్రతిపత్తి కల్పించాలని కూడా అభ్యర్థించింది.
పెట్రోలియమ్ శాఖకు సమర్పించిన వార్షిక పని తీరు పత్రంలో ఐఓసీ ఈ విషయం ప్రస్తావించింది. నవరత్న చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్, గృహాలకు వినియోగించే ఎల్‌పీజీ, కిరోసిన్ ధరలను స్వయంగా నిర్ణయించుకునేందుకు అవకాశం ఇవ్వాలని అందులో పేర్కొంది.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం చమురు మార్కెటింగ్ సంస్థలు చమురు ధరలను పెంచకుండా చర్యలు తీసుకొంటోంది. దీని వల్ల ఈ ఆర్థిక సంవత్సరం (2009-10)లో తమ సంస్థకు రూ.23,510 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఐఓసీ పేర్కొంది.
వనరుల తరుగుదలను తట్టుకోవడానికి, మూలధన సమీకరణకు అవసరమైన లాభాలను ఆర్జించడానికి, పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో తక్కువ మూలధన ఖర్చుతో భవిష్యత్ ప్రణాళికలను చేపట్టేందుకు ప్రభుత్వం పెట్రో ధరల నిర్ణయాన్ని తమకు వదిలేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఓసీ అభిప్రాయపడింది.