పొరుగు దేశమైన పాకిస్థాన్ దేశంలో ఉల్లిపాయల ఉత్పత్తులు పెరగడంతో విదేశీ మార్కెట్లో దేశీయ ఉల్లిపాయల ఎగుమతులు తగ్గాయి. భారతదేశం నుంచి ఎగుమతులయ్యే ఉల్లిపాయల్లో గత నెల 29 శాతం తగ్గుదల నమోదు చేసుకున్నట్లు నాఫెడ్ అధికార వర్గాలు వెల్లడించాయి.
సెప్టెంబర్ నెలలో భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతులయ్యే ఉల్లిపాయలు 94,836 టన్నులుగా ఉండిందని, అదే నిరుడు ఇదే కాలంలో జరిగిన ఎగుమతుల్లో 1,34,040 టన్నులుగా ఉండిందని నాఫెడ్ అధికారి ఒకరు తెలిపారు.
వీటికంతటికీ కారణం పాకిస్థాన్ దేశంలో ఉల్లిపాయల ఉత్పత్తులు ఎక్కువవడంతో ఆ దేశం విదేశాలకు ఎగుమతులు చేస్తోందని ఆయన అన్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా దేశాలు మరియు శ్రీలంకకు ఉల్లిపాయలను పాక్ ఎగుమతి చేస్తోందన్నారు.
నిరుడు ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఉల్లిపాయలను పశ్చిమ ఆసియా దేశాలు మరియు శ్రీలంకకు ఎగుమతులు చేసామని, కాని ప్రస్తుతం పాక్ నుంచి ఉల్లిపాయలు ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
ఇదిలావుండగా నిరుడు పాకిస్థాన్ దేశంలో ఉల్లిపాయల పంట పాడైపోవడంతో భారతదేశం నుంచి 1,69,918 టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ఈ ఏడాది ఉల్లిపాయల పంట చేతికందడంతో భారతదేశం నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడంలో తగ్గుదల కనపరచిందని, ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉల్లిపాయల ఎగుమతులు ఇప్పటి వరకు 9.91 లక్షల టన్నులకు చేరుకుందని, అదే నిరుడు ఇదే కాలానికి 9.15 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసినట్లు నాఫెడ్ అధికారులు తెలిపారు.