ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యాన్ని ఓ అవకాశంగా తీసుకుని భవిష్యత్‌లో గుణాపాఠాలు నేర్చుకోవాలని ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ప్రారంభమైన తూర్పు ఆసియా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యాన్ని ఓ గుణపాఠంగా స్వీకరించి, భవిష్యత్‌లో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
మనమధ్య ఆర్థిక సమగ్రత ఉంటే కోట్లాది డాలర్ల అదనపు పెట్టుబడులు వాతంట అవే వస్తాయని ఆయన నొక్కివక్కాణించారు. ఇకపోతే.. వివిధ దేశాల మధ్య అమలులో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలన్నింటినీ ఆసియా ఉమ్మడి వాణిజ్య ఒప్పందంగా రూపాంతరం చేయాలని మన్మోహన్ సింగ్ కోరారు. అలాగే, అభివృద్ధి విధానంలో ఆసియా దేశాల మధ్య సమన్వయం ఏర్పడాల్సి ఉందన్నారు.
ప్రపంచ దేశాల దృష్టంతా ఇప్పుడు ఆసియా దేశాలపైనే ఉందని, ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నేతృత్వం వహించే స్థాయికి ఎదగాల్సిన అవసరముందన్నారు. ఆసియా దేశాలు కొన్ని దశాబ్దాల క్రితమే ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని, ప్రస్తుతం జి-20 దేశాల కూటమిలోని ఆరు దేశాలు ఇఎఎస్ సభ్యదేశాలేనని మన్మోహన్ సింగ్ గుర్తు చేశారు.