దేశంలోని దాదాపు ఐదు కంపెనీలకు " మహారత్న " స్థాయిని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
దేశంలోనున్న కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పలు కంపెనీల్లో దాదాపు ఐదు కంపెనీలకు మహారత్న స్థాయిని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి భాస్కర్ ఛటర్జీ అన్నారు.
కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ 34వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ... దేశీయ ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల్లో ఐదు కంపెనీలకు మహారత్న స్థాయి కల్పించనున్నామని, దీనికి మరో నెల రోజులు పట్టవచ్చని ఆయన వెల్లడించారు.
దేశంలోని ఆయిల్ అండ్ గ్యాస్ నిగమ్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్, కోల్ ఇండియా కంపెనీలకు "మహారత్న" స్థాయి కల్పించనున్నామని ఆయన తెలిపారు.
ఏ కంపెనీకైనా ఈ స్థాయి లభిస్తే ఆ కంపెనీకి చెందిన బోర్డు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుందని, నిశ్చిత సమయం వరకు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుందని, దీంతో సంబంధిత మంత్రిత్వ శాఖపై ఆధారపడాల్సిన పనిలేదని ఆయన వివరించారు.
" మహారత్న " స్థాయి కలిగిన కంపెనీలు దేశ విదేశాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండానే రూ. 50 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. దీంతో కంపెనీకి చెందిన పెట్టుబడిలో ఈ మొత్తం 1/3వ వంతుకు ఎక్కువగా ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని ఆయన తెలిపారు.
ఏ కంపెనీలైతే మహారత్న స్థాయి కలిగివున్నాయో అవి విదేశాలలో తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సివుంటుందని ఆయన అన్నారు. నవరత్న కంపెనీలు తమ చాకచక్యంతో దాదాపు 25 వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన తెలిపారు.
మహారత్న స్థాయిని ఇచ్చేందుకు సదరు కంపెనీల ఆర్థిక స్థితిగతులు, వాటి పనితీరుపై ఆధారపడివుంటుందని ఆయన అన్నారు.