సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » టాటా సంస్థలకు వారసుడు కావాలి: రతన్ టాటా (TATA | Rathan TATA | TATA Motors | Nano Car | Wall street | TATA Steel)
Feedback Print Bookmark and Share
 
FILE
ఉప్పు నుంచి ఉక్కు వరకు అమ్మే సత్తాగల వ్యక్తి కోసం టాటా సంస్థ ఎదురు చూస్తోంది. అంటే ప్రపంచంలోనే పెద్ద పారిశ్రామిక, వ్యాపార గ్రూపు కంపెనీలకు అధిపతయ్యే అవకాశం ఎవరికి దక్కనుందో...! రతన్ టాటాకు వారసుడు కావాలి.

దేశ-విదేశాల్లో అతి పెద్ద సంస్థ అయిన టాటా సంస్థను సమర్ధవంతంగా నడిపేందుకు అత్యంత సమర్ధుడైన నాయకుడు కావాలి. భారతీయుడైతే మరీ మంచిదంటున్నారు రతన్ టాటా.

విదేశీయుడైనా ఫర్వాలేదని లక్ష రూపాయల నానో కారుతో దేశంలో సంచలనం సృష్టించిన టాటా కంపెనీ అధినేత రతన్ టాటా తన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా రతన్ టాటా(71) వాల్ స్ట్రీట్ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది బుధవారం నాటి సంచికలో ప్రచురితమైంది.

టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా పవర్ వంటి 27 లిస్టెడ్ కంపెనీలు ఉన్న గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సారధ్యం వహించగల వ్యక్తి కోసం దేశ, విదేశీ అభ్యర్ధులను వెతుకుతున్నామని ఆయన వెల్లడించారు.

గత ఇరవై సంవత్సరాలుగా టాటా సంస్థలను నడిపిన రతన్ మాట్లాడుతూ...నా స్థానంలో నాకు వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాం. ప్రస్తుతానికి బయటి నుంచి సలహాదారులు ఉన్నారు. సాధారణ ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఇందులో ఎలాంటి పరిమితులు లేవని ఆయన అన్నారు.

వారసుడు తమ గ్రూపు నుంచైనా, బయట నుంచైనా ఎంపిక కావచ్చన్నారు. ఆ వ్యక్తి గ్రూపును అభివృద్ధి పథంలో నడిపేవాడు కావాలన్నారు. ఇంతవరకూ టాటా కుటుంబం నుంచే చైర్మన్లు అయ్యారు. కానీ రతన్‌కు వారసునిగా కుటుంబసభ్యులెవరి పేర్లూ ఇంతవరకూ ప్రచారంలోకి రాలేదు.

ప్రస్తుతం 98 కంపెనీలు టాటా గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సంవత్సరానికి దాదాపు మూడు లక్షల 55 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాగిస్తోంది. మూడు లక్షల 57 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1868లో భారతదేశంలో అవతరించిన టాటా గ్రూపు దేశంలోనే అతిపెద్ద మోటారు వాహనాల తయారీదారుగా ఉంది.

పెద్ద సాప్ట్ వేర్ కంపెనీగా, ప్రైవేట్ వ్యవస్థలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారుగా ఉంది. అలానే ఉక్కు ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే టాటా స్టీల్ ఎనిమిదవ స్థానంలో ఉందని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ విస్తరణకు రతన్ టాటాయే శ్రీకారం చుట్టారు. 2007 లో టాటా స్టీల్ ఆంగ్లో-డచ్ ఉక్కుకంపెనీ కోరస్ ను 65 వేల కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది. 2008లో టాటా మోటర్స్ సుమారు 11500 కోట్ల రూపాయలతో జాగ్వార్ లాండ్ రోవర్ ను స్వాధీనం చేసుకుంది. మరిన్ని విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా టాటా గ్రూపు విస్తరణకు ఇంకా సిద్దంగా ఉందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ప్రక్రియ కష్టాల్లో పడిందని ఆయన తెలిపారు. పరిస్థితులు కంపెనీ ఖర్చును తగ్గించేదిశగా నడిపించాయన్నారు. కష్టకాలంలో కూడా టాటా మోటార్స్ సంస్థ దాదాపు 15 వేల కోట్ల రూపాయల అప్పులను తీర్చిందని ఆయన అన్నారు. ఆ లక్ష్యసాధన ఎంత కష్టమైందో చాలామందికి తెలియదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.