లోక్‌సభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభవగానే విపక్షాలు చెరకు మద్దతు ధరపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు ఢిల్లీ వీధుల్లో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధరపై పునరాలోచనలో పడింది.
ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ఈ అంశంపై జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం, కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. వారితో చర్చలు జరిపిన తర్వాత చెరకు ధరపై పునరాలోచిస్తామని ఆయన వెల్లడించారు.
దీంతో సమస్య సానుకూలంగానే పరిష్కారమౌతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోను, మిల్లర్లతోను కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేసిందని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి.