దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే యాపిల్ పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఈ పండ్లు మరింత మేలైనవిగా, నాణ్యవంతంగా ఉత్పత్తి చేసేందుకు ఇజ్రాయేల్ సంస్థతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం యాపిల్ పండ్ల మొక్కల ఎత్తును తగ్గించడమే కాకుండా, మేలైన వంగడాలతో పంట దిగుబడి మరింతగా వచ్చేలా కృషి చేస్తారు.
సాధారణంగా, 5000 వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండ ప్రాంతాల్లో యాపిల్ సాగు సాగుతోంది. అయితే ఈ పంటను అతి తక్కువ ఎత్తులో పెంచేలా ఈ ఒప్పందం దోహదపడనుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వాతావరణ వరణ పరిస్థితులే ఇజ్రాయేల్ దేశంలోనూ ఉంటాయి. అందువల్ల అక్కడి సాగు పద్దతిని హిమాచల్ ప్రదేశ్‌లో అమలుచేసేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తక్కువ ఎత్తు కలిగిన కొండ ప్రాంతాల్లో ఈ పంటను పండించేందుకు ఇరు వర్గాలు కృషి చేస్తాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు అనే జిల్లాలో యాపిల్ సాగు విస్తీర్ణం అత్యధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రవహిస్తున్న బియాస్ నదీ తీరంలో కూడా యాపిల్ సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది. అలాగే, రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు కూడా యాపిల్ సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. దీన్ని క్యాచ్ చేసుకునేందుకు ఇజ్రాయేల్ అధికారులు ముందుకు వచ్చి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.