రాష్ట్రంలో వేర్పాటువాద ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు, ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం గట్టి భద్రత కల్పించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఐజీ కృష్ణప్రసాద్ ప్రత్యేక అధికారిగా ఈ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశారు.
ఐటి తదితర పరిశ్రమలకు, ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు ఆ పరిశ్రమల యాజమాన్యానికి ఎప్పటికప్పుడు ఉద్రిక్తతల పరిస్థితిని ఈ టాస్క్‌ఫోర్స్ విభాగం తెలియజేస్తుంది. ఈ విషయాన్ని అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) ఎకె ఖాన్ శనివారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.
ఇటీవల కాలంలో రాజధాని హైదరాబాద్‌లో, విశాఖపట్నం, విజయవాడలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమకు పటిష్టమైన భద్రతను కల్పించాలని ఐటి కంపెనీల యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరిందన్నారు. గచ్చిబౌలి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఐటి పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, తమకు సంబంధించిన క్లైంట్లు విదేశాలు, మెట్రో నగరాల నుంచి వస్తున్నారని, ముందుగా ఇక్కడి పరిస్ధితులను ఎప్పటికప్పుడు ఇ-మెయిల్స్ ద్వారా హెచ్చరించాలని వారు కోరినట్లు ఆయన చెప్పారు.