దేశంలో న్యూక్లియర్ ప్రమాదాలకు బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఇన్సూరెసన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) సభ్యుడు ఆర్.కన్నన్ తెలిపారు. ఈ అంశంపై ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రస్తుతం వివిధ ప్రమాదాలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. అయితే, న్యూక్లియర్ ప్రమాదాలకు మాత్రం ఈ సౌకర్యం లేదన్నారు.
ప్రస్తుతం భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ తరహా ప్రమాదాలకు కూడా బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ సెక్టార్‌కు చెందిన వాచ్‌డాగ్ సంస్థ వివిధ బీమా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.
ఇందుకు సంబంధించి రీ ఇన్సూర్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ) ఈ దిశగా పని చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సౌకర్యం కల్పించేందుకు కావాల్సిన వాటి కోసం జీఐసీ పని చేస్తోందన్నారు.