రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ప్రోత్సాహక ప్యాకేజీలను దశల వారీగా వాపసు తీసుకుంటుందని, ఇది వార్షిక బడ్జెట్‌కు ముందే ఉంటుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దేశంలోని పలు పరిశ్రమలు, సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రోత్సాహక ప్యాకేజీలు ఇచ్చింది. ప్రస్తుతం మాంద్యం నుంచి దేశీయ మార్కెట్ కోలుకుంటుండటంతో ప్రోత్సాహక ప్యాకేజీలను దశల వారీగా వాపసు తీసుకుంటుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మెన్ సి. రంగరాజన్ మీడియాకు తెలిపారు.
ప్రోత్సాహక ప్యాకేజీలను వాపసు తీసుకోవడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం లేకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని, దీనిని దశల వారీగా అమలు చేస్తుందని ఆయన అన్నారు. రానున్న వార్షిక బడ్జెట్ అన్ని వర్గాలకు సంతృప్తి కరంగా ఉండేలా ప్రభుత్వం ఆచి తూచి అడుగులేస్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతోపాటు ప్రభుత్వ ఖజానా లోటును భర్తీ చేసేందుకు తగిన చర్యలు కూడా తీసుకోనుందని ఆయన అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వపు ఖజానా లోటు 6.8 శాతంగా ఉండొచ్చనే అనుమానాలున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వ ఖజానాలో లోటు ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వాపసు తీసుకునే ప్రోత్సాహక ప్యాకేజీలు వార్షిక బడ్జెట్‌కు ముందే ఉంటుందని ఆయన తెలిపారు.