ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » భారతీయ పవన విద్యుత్ మార్కెట్‌లోకి "గమేశా" (Gamesa | India | China | Asia | spanish | Wind power | Business)
స్పెయిన్ కేంద్రంగా పని చేస్తున్న పవన విద్యుత్ పరికరాల తయారీలో కంపనీ అయిన గమేశా లిమిటెడ్ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే, యునైటెడ్ స్టేట్స్, చైనా మార్కెట్‌లలో తన హవాను చాటుతున్న గమేశా.. తాజాగా భారత్‌లోకి తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ఛైర్మన్ అండ్ సీఈఓ జార్జ్ కల్వెర్ట్, మేనేజింగ్ డైరక్టర్ రమేష్‌లు మంగళవారం చెన్నయ్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు.
స్పెయిన్ కేంద్ర కార్యాలయంగా పని చేస్తున్న గమేశా లిమిటెడ్ కంపనీ తన కార్యకలాపాలను 1974లో ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కంపెనీ గత యేడాదిలో చెన్నయ్‌లో తన భారతీయ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కార్యాలయం నగర శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్‌లో ఉందన్నారు. ప్రస్తుతం వంద మంది ఉద్యోగులు ఉన్నారని, వీరి సంఖ్యను ఈ యేడాది రెండు వందలకు పెంచనున్నట్టు వారు తెలిపారు.
భారత్‌తో పాటు.. శ్రీలంక మార్కెట్‌లను దృష్టిలో ఉంచుకుని చెన్నయ్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ప్రస్తుతం కోయంబత్తూరు, తేనిలలో పవన విద్యుత్ ప్లాంట్‌లను నెలకొల్పేందుకు ఆర్డర్లు పొందినట్టు చెప్పారు.
ఈ ఆర్డర్లు ఇచ్చిన కంపెనీలలో బ్లూ చిప్స్, శ్రీ షణ్ముగ, ఎల్ఎండబ్ల్యు తదితర కంపెనీలు ఉన్నట్టు వివరించారు. ఈ రెండు కేంద్రాల్లో విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నట్టు వివరించారు.
అలాగే, శ్రీలంకలో కూడా ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇక్కడ 20 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఆర్డర్లు పొందామని గుర్తు చేశారు. దీంతో పాటు.. 850 మెగావాట్‌ల సామర్థ్యం కలిగిన 25 పవన్ విద్యుత్ టర్బైన్ల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అంతేకాకుండా, దేశంలో చమురు, గ్యాస్ నిక్షేపాలు తరిగి పోతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై దృష్టి సారించక పోతే భవిష్యత్‌లో విద్యుత్ కష్టాలు తప్పవని వారు హెచ్చరించారు.
సంప్రదాయేతర ఇంధన వనరులను పెంపొందించుకోవడంలో అమెరికా, చైనా దేశాలు ముందంజలో ఉన్నట్టు వారు తెలిపారు. దీంతో ప్రపంచ దేశాల దృష్టి కూడా ఈ రంగంవైపు మళ్లిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియాలో ఉన్న మార్కెట్ అవకశాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా భారత్‌లోకి తాము అడుగుపెట్టినట్టు జార్గే కాల్వెట్, రమేష్‌లు వివరించారు.