కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా పది శాతం పెంచేయడంతో దేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచేందుకు నిర్ణయించాయి.
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పది శాతం మేరకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో దేశీయ కార్ల నిర్మాణాల కంపెనీలు స్పందించి తాము కూడా కార్ల ధరలను దాదాపు రూ. 25,000ల మేరకు పెంచనున్నట్లు ప్రకటించాయి.
ఇందులో భాగంగా మారుతి సుజుకీ ఇండియా (ఎమ్ఎస్ఐ) కంపెనీ ఛైర్మెన్ ఆర్‌సి భార్గవ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించడంతో తమ సంస్థకు చెందిన కార్ల ధరల్లోను రెండు శాతం పెంచనున్నామన్నారు.
అలాగే మరో కార్ల నిర్మాణ కంపెనీ హుండాయ్ ప్రతినిధి స్పందిస్తూ తమ సంస్థకు చెందిన కార్ల ధరలలోను మార్పులుంటాయన్నారు. వీటిలో దాదాపు రూ. 6,500 నుంచి, రూ. 25,000ల వరకు పెరిగే సూచనలున్నాయని ఆయన తెలిపారు. కాగా వోల్వో ఆటో ఇండియా కూడా తన సంస్థకు చెందిన వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.