రాష్ట్రంలో సిమెంట్‌కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా సిమెంటు బస్తా ఏకంగా రెండు వందల రూపాయలకు చేరుకుంది. ఈ ధర ఇంకా పెరిగి బస్తాకు రూ. 225 అయ్యే సూచనులన్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
గత ఆగస్టు- సెప్టెంబరు మధ్య కాలంలో రూ.130కి పడిపోయిన సిమెంటు బస్తా ధర ఇప్పుడు మళ్లీ రూ.200కు చేరుకుంది. ప్రీమియం బ్రాండ్ల నుంచి సాధారణ బ్రాండ్ల వరకూ సిమెంటు ధర ప్రస్తుతం రూ.190 నుంచి రూ.205 వరకూ పలుకుతోంది. గత రెండు మూడు నెలల వ్యవధిలోనే సిమెంటు ధర శరవేగంగా పెరగుతూ పోతుండటం గమనార్హం.
ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి గృహ తదితర నిర్మాణాలకు అనుకూలమైన సీజన్ కావడంతో ధర కాస్త ఎక్కువగా ఉండటం సహజమే. కానీ ఇంత త్వరగా మళ్లీ రూ.200కు చేరుకుంటుందని ఊహించలేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇదిలావుండగా ప్రతి బస్తాకు రూ.25 వరకూ ధర పెంచేందుకు ఉత్పత్తిదారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్కెట్లో సిమెంటుకు డిమాండ్ అధికంగా ఉందని, దీంతోపాటు రాష్ట్రంలో కరెంటు కోత వల్ల భారీగా ఉత్పత్తి పడిపోవడంతో రిటైల్ మార్కెట్లో దీని ధర పెరిగిపోతోందని మార్కెట్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.