కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మొబైల్ నంబర్ పోర్టబులిటీ మరియు వేలంపాట ఆధారిత స్పెక్ట్రమే కేటాయింపులపై టెలికాం విభాగానికి (డీవోటీ), టెలికాం కంపెనీలకు మధ్య బుధవారం జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని రాబట్టకుండానే ముగిసాయి. టెలికాం పరిశ్రమ కోసం నిర్మాణాత్మకమైన సెటిల్‌మెంట్ ప్రణాళికను డీవోటీ ప్రకటించని నేపథ్యంలో టెలికం కంపెనీ సీఈవోలకు, డీవోటీ కార్యదర్శి డీఎస్.మాథుర్ మధ్య జరిగిన చర్చలు ఫలవంతం కాలేదు.
చర్చలలో పాల్గనే నిమిత్తం భారత సెల్యూలర్ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులు బుధవారం మధ్యాహ్న భోజన విరామానంతరం మాథుర్‌ను కలిశారు. ఇదిలా ఉండగా సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చుకున్నప్పటికీ మొబైల్ నంబర్‌ను మొబైల్ వినియోగదారులు మార్చుకోనవసరం లేని వెసులుబాటును దేశంలోని మెట్రోనగరాలైన న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నైలలో 2008 మార్చి నుంచి అమలులోకి తీసుకు వస్తామంటూ నవంబర్ 12న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మరియు ఎయిర్‌టెల్ టెలికాం కంపెనీలు స్వాగతించాయి.
|