టెలికాం మౌళిక సదుపాయాల రంగంలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా రూ.300కోట్లు వెచ్చించనున్నట్లు ప్రముఖ ఎస్ఆర్ఈఐ గ్రూప్ కంపెనీల్లో ఒక భాగమైన క్విప్పో టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (క్యూటీఐఎల్) సంస్థ వెల్లడించింది.
న్యూఢిల్లీలో క్యూటీఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కపూర్ విలేకరులతో మాట్లాడుతూ సంస్థ విస్తరణలో భాగంగా సంఘటిత మరియు అసంఘటితంగా ఈ భారీ పెట్టుబడులు వినియోగించేందుకు ప్రణాళిక చేస్తున్నామన్నారు. అతి పెద్ద టెలికాం టవర్ వ్యాపారాన్ని కలిగి ఉన్న టాటా టెలీసర్వీసెస్ సంస్థతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నామని అరుణ్ వ్యాఖ్యానించారు.
ఈ చర్చలు సానుకూలమైన వైఖరితో ఫలప్రదంగా సాగుతున్నట్లు వివరించారు. బహుశా వచ్చే నెలలో ఈ ఒప్పందానికి టాటా టెలీసర్వీసెస్ సంస్థ అంగీకరించవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్ధికపరమైన విషయాలను వెల్లడించేందుకు అరుణ్ నిరాకరించారు.
ప్రస్తుతం 4,500 టవర్లను కలిగిఉన్న తమ సంస్థ 2009 మార్చి కల్లా 10,000లకు పెంచాలని ప్రణాళిక చేస్తున్నట్లు అరుణ్ స్పష్టం చేశారు. అలాగే సమర్థవంతమైన మౌళికసదుపాయాల సంయుక్త భాగస్వామ్యం దిశగా కూడా ప్రస్తుతం యోచిస్తున్నట్లు తెలిపారు.
|