భారత ఐటీ కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ సంస్థలు జర్మనీకి చెందిన ఐటీ కంపెనీలపై కన్నేశాయి. వోల్వో, బోస్క్ వంటి భారీస్థాయి ఔట్ సోర్సింగ్ కంపెనీలను హస్తగతం చేసుకోవాలని ఇప్పటికే ఈ భారతీయ ఐటీ సంస్థలు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిసింది. యూరప్‌లో లాభాలను మరింతగా పెంచుకునేందుకు అక్కడి వినియోగదారులను ఆకర్షించేందుకు ఆ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ప్రముఖ భారతీయ ఐటి సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ... పని లభ్యత ఆధారంగా పెట్టుబడి సంబంధిత ఒప్పందాలు ఎక్కడైనా 400 నుంచి 500 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందన్నారు. ఈ ఒప్పందాలతో వార్షిక ఆదాయం 300 మిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే తాము ఈ ఆదాయన్ని అధిగమించగలమని ధీమా వ్యక్తం చేశారు.కీలకమైన అమెరికా మార్కెట్‌లో సాఫ్ట్‌వేర్ సేవలకు డిమాండ్ తగ్గడంతో దాని ప్రభావం భారతీయ ఐటి సంస్థలపైనా పడింది. దీంతో లాభాలు కూడా కొంత వరకు తగ్గుముఖం పట్టాయన్నది వాస్తవం. ఇలాంటి తగ్గుదలను పూడ్చుకునేందుకు యూరప్ లాంటి దేశాల్లో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉపయోగపడతాయన్నది భారత ఐటీ పరిశ్రమ వర్గాలు విశ్లేషణ. |