విదేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళిక చేసినట్లు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఈ విస్తరణ కార్యకలాపాల కోసం సుమారు 600 నుంచి 700 మిలియన్ డాలర్ల మేరకు వెచ్చించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అలాగే విదేశీ ఐటీ సంస్థలను కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు పేర్కొంది.న్యూఢిల్లీలో విలేకరులతో ఇన్ఫోసిస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎస్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ.. విదేశీ కంపెనీలను హస్తగతం చేసుకోవడం లేదా వారితో కలిసి పనిచేయడం వంటి వాటిపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రస్తుతం జపాన్, యూరప్‌లలో బీపీఓ, కన్సల్టింగ్, ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్‌లు, శాప్ వంటి వాటికి అక్కడి మార్కెట్‌లలో డిమాండ్ ఉందన్నారు.వచ్చే ఏడాదిలో ఐటి కంపెనీలు నిర్వహణ కోసం తక్కువ ఖర్చు చేస్తాయని గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. అయితే గణాంకాల ప్రకారం 2009లో గ్లోబల్ ఐటీ రంగంలో సుమారు 2.6 శాతం మేరకు ఖర్చులు పెరగనున్నాయని తమ సర్వేలో వెల్లడైనట్లు ఐడీసీ సంస్థ తెలపడం గమనార్హం. |