భారత ఐటీలపై అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రభావం అంతగా లేదని ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల సంస్థ విప్రో టెక్నాలజీస్ కంపెనీ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడి ఐటీ పరిశ్రమ చక్కగా సాగుతోందని తెలిపారు. ఈ ఏడాదిలో 32 శాతం నుంచి 24 శాతానికి భారత ఐటీ ఎగుమతుల లాభాలు పడిపోనున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రేమ్‌జీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.న్యూఢిల్లీలో మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రేమ్‌జీ మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం కారణంగా ఐటీ పరిశ్రమ తగ్గుముఖం పట్టినట్లయితే.. దాని ప్రభావం లేదంటూ నిరాడంబరంగా చెప్పలేమని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి పురోభివృద్ధి సాధించాలనే దానిపైనే ఐటీ పరిశ్రమ ప్రణాళిక చేస్తోందన్నారు.సంక్షోభ ప్రభావం ప్రపంచంలోని అన్ని రంగాలపై తప్పక చూపిస్తుంది. అయితే ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐటీ పరిశ్రమ సామర్థ్యం కలిగి ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే తరహా పరిస్థితి 2001లోను తలెత్తింది. ఏది ఏమైనప్పటికీ, ఇలాంటి పరిస్థితులను ఐటీ ఉపయోగకరంగా మార్చుకోగలదని తెలిపారు. అయితే ఈ విషయంపై ఇన్ఫోసిస్ టెక్నాలజీ కో ఛైర్మన్ నందన్ నిలేకని మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభ ప్రభావంతో ఐటీ సేవల అభివృద్ధి మందగించిందని వెల్లడించడం గమనార్హం. |