సుమారు ఐదు మిలియన్ ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లను ఇరాన్ ప్రభుత్వం నిషేధించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిషేధింపబడిన వాటిల్లో చాలా వరకు కొత్త వెబ్‌సైట్లు ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అశ్లీల చిత్రాలు, యాంటీ ఇస్లామిక్, మహిళలు, మానవ హక్కులు, రాజకీయం వంటి అంశాలకు చెందిన నైతిక విలువల నియమాన్ని ఉల్లంఘించిన సైట్లను నిషేధించినట్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వెల్లడించారు.ఇరాన్‌లో ప్రస్తుతం 21 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో దాదాపు చాలా మంది ఉపయోగించే పాప్యులర్ వెబ్‌సైట్లయిన ఫేస్‌బుక్, యూట్యూబ్‌లను కూడా ఇరాన్ నిషేధించినట్లు స్కై న్యూస్ పత్రిక తెలిపింది. తమ అసమ్మతి లేదా అభిప్రాయాలను తెలుపుకునే వెబ్‌బ్లాగు వంటి వాటిని కూడా చాలా వరకు నియంత్రించినట్లుగా పేర్కొంది.స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్‌కు సలహాదారుగా ఉన్న అబ్డోల్‌సమాద్ ఖోరామ్ అబాడీ మాట్లాడుతూ... ఇంటర్నెట్ ద్వారా తమ మతానికి భంగం కలిగించేందుకు శత్రువులు చూస్తున్నారని తెలిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలను దెబ్బతీసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లుగా వివరించారు. |