అమెరికా కొత్త అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం మన దేశంలో ఐటీ పరిశ్రమపై ఉంటుందని ఆర్థికశాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఒబామా తన బడ్జెట్‌లో ఔట్‌సోర్సింగ్ చేసే అమెరికా కంపెనీలకు టాక్స్ మినహాయింపులను రద్దు చేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.అంతేగాకుండా, అమెరికాలోనే పనులు చేయించుకునే కంపెనీలకు 95 శాతం ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలని కూడా ఒబామా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో ఆయన స్వదేశంలో విపక్షాల నుంచి పలు విమర్శలను ఎదుర్కొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తన అభిప్రాయాలను మంత్రి ప్రణబ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఒక దేశ ఆర్థిక సమస్యలకు ఆ దేశమే పరిష్కారాలు వెతుక్కుంటుందని, మనం మరొకరికి మార్గాలు చెప్పలేమని ప్రణబ్ పేర్కొన్నారు. అయితే ఒబామా ప్రస్తుత నిర్ణయం ప్రభావం మన దేశ ఐటీ పరిశ్రమపై ఖచ్చితంగా ఉండగదలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.అమెరికాలోని వెయ్యి కంపెనీలకు పైగా ఔట్‌సోర్సింగ్ ద్వారా పనులు చేసుకుంటున్నాయని... ఒబామా ప్రభుత్వం కూడా ఇంకా దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రణబ్ పై ఇంటర్వ్యూలో వివరించారు. |