ఆంగ్లభాషలో మిలియన్ పదం (పదిలక్షలవ పదం)గా "వెబ్ 2.0" అనే సాంకేతిక పదం ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆస్కార్‌ను అలంకరించుకున్న రెహమాన్ "జయహో" రన్నరప్‌గా, డానీబోయల్ "స్లమ్‌డాగ్" నాలుగో స్థానాలతో సరిపెట్టుకోగా... వాటిని పోటీలో వెనుకకు నెట్టిన వెబ్ 2.0 అనే పదం అనూహ్యంగా విజయాన్ని కైవసం చేసుకుంది.ఈ సాంకేతిక పదానికి "నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ ప్రాడక్ట్స్ అండ్ సర్వీసెస్" అని అర్థం. అయితే ఇది సాంకేతిక పదజాలం పరిధిని మించి పాపులర్ అయిపోయింది. సమాచార విపణి (సెర్చ్ ఇంజిన్ల)లో అత్యధికంగా 25 వేలసార్లు చోటు చేసుకుని గత ఆరు నెలల్లో అందరి నోళ్లలోనూ బాగా నానుతోంది. అదే ఊపులో పది లక్షలో పదంగా వెబ్ 2.0 రికార్డులకెక్కేసింది.ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పదాలు, పదబంధాల ఫ్రీక్వెన్సీని శాస్త్రీయంగా లెక్కించే "గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్ (జీఎల్ఎం)" అనే అమెరికా సంస్థ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. బుధవారం (2009 జూన్ 10) ఉదయం 10.22 గంటలకు వెబ్ 2.0 ఈ ఘనతను సాధించినట్లు జీఎల్ఎం సంస్థ అధ్యక్షుడు, చీఫ్ వర్డ్ అనలిస్ట్ పాల్ జేజే వయక్ ప్రకటించారు.ఆంగ్ల పదాలు మొదట్లో స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్ (షేక్స్‌పియర్ స్వగ్రామం) నుంచి మాత్రమే పుట్టుకొచ్చేవనీ, కొంతకాలంగా ఆ పరిస్థితిలో బాగా మార్పు వచ్చినట్లు పాల్ పేర్కొన్నారు. భారత్, చైనా, పోలండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, సిలికాన్ వాలీల నుంచి ఇప్పుడు సరికొత్త పదాలు ఆంగ్లంలో వచ్చి చేరుతున్నట్లు ఆయన చెప్పారు.పది లక్షలో పదం షేక్స్‌పియర్ స్వగ్రామం నుంచి వచ్చేందుకు ఎంతగా ఆస్కారం ఉందో, భారత్, చైనా దేశాల నుంచి కూడా వచ్చేందుకు అంతే ఆస్కారముందని జీఎల్ఎం ఇటీవలనే వ్యాఖ్యానించింది కూడా.. అన్నట్టు.. మహిళల లోదుస్తులకు భారత్‌లో వాడే "చెడ్డీస్" వంటి పలు పదాలు కూడా ఈ పోటీలో నిలవడం గమనార్హం. |