ప్రముఖ అంతర్జాతీయ ఐటీ రంగ సంస్థ ఆపిల్ కంపెనీచే తయారు చేయబడిన సరికొత్త ఐఫోన్ ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత మార్కెట్లోకి రానుంది. దేశంలోని ప్రధాన జీఎస్ఎం టెలికాం ఆపరేటర్లయిన భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఎస్సార్‌లు ఈ కొత్త ఐఫోన్‌ను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.అత్యంత వేగవంతమైన డేటా, సరికొత్త కెమేరా, వీడియో రికార్డింగ్ తదితర సౌకర్యాలు.. ఈ కొత్త ఐఫోన్‌లో ఉంటాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఆపిల్ కంపెనీతో ఇప్పటికే భారతి, వొడాఫోన్ కంపెనీలు ఒప్పందాలు కలిగి ఉన్నాయి. కాగా, ఆగస్ట్‌లో తాము తయారు చేసిన సరికొత్త ఐఫోన్ 3జీఎస్‌ను భారత్‌లో ప్రవేశపెడతామని సూచన ప్రాయంగా తెలిపిన ఆపిల్ కంపెనీ.. విడుదల తేదీని.. దాని ధరను వెల్లడించలేదు. అయితే అదే నెలలో ప్రపంచంలోని 31 దేశాల్లో ఒకేసారి ఈ కొత్త ఐఫోన్‌ను విడుదల చేయనున్నట్లు మాత్రం ఆపిల్ కంపెనీ తెలిపింది.అంతకంటే ముందుగా.. అమెరికా తదితర 10 దేశాల్లో జూన్ 19న.. అనంతరం జూలైలో 32 దేశాల్లో ఈ కొత్త ఐఫోన్ విడుదల చేస్తామన్నారు. మరోవైపు ఈ కొత్త ఐఫోన్‌పై వివరాలను వెల్లడించేందుకు భారతి, వొడాఫోన్ కంపెనీలు నిరాకరించాయి. అయితే భారత్‌లో ఇప్పటికే విడుదలైన నోకియా ఎన్97, బ్లాక్‌బెర్రీ, శామ్‌సంగ్ తదితర ఫోన్‌లకు ఈ కొత్త ఐఫోన్ గట్టి పోటీనివ్వగలదని తెలిపాయి. అదలా ఉంచితే.. భారత్‌లో 400 మిలియన్ సెల్‌ఫోన్ వినియోగదారులుండగా.. అందులో భారతి మరియు వొడాఫోన్‌లకు సంయుక్తంగా 170 మిలియన్‌ల వరకు వినియోగదారులున్నారు.దీంతో మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ కొత్త ఐఫోన్ రాకతో ఇరు కంపెనీలు మరింతగా వినియోగదారులను ఆకర్షించనున్నట్లు తెలుస్తోంది. |