మైక్రోమాక్స్ రూ. 250 కోట్లు పెట్టుబడులుగుర్గావ్‌కు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ ఇన్ఫర్మేటిక్స్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 250 కోట్లు మేరకు పెట్టుబడులు చేయనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కంపెనీకి చెందిన ఉత్పత్తి ప్లాంటును ప్రారంభించేందుకు మైక్రోమాక్స్ ఈ పెట్టుబడులు చేస్తోంది.
మైక్రోమాక్స్ ఇన్ఫర్మేటిక్స్ సీఓఓ రాహుల్ శర్మా మీడియాతో మాట్లాడుతూ, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ. 250 కోట్లతో మొబైల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే మరో రూ. 50 కోట్లతో విస్తారమైన భవన నిర్మాణాన్ని చేయనున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది మార్చిలో ఈ కొత్త ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఒక నెలలో మూడు లక్షల యూనిట్ల హ్యాండ్‌సెట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంటుందని వివరించారు. ప్రస్తుతం తమ కంపెనీ.. చైనా, కొరియా, టైవాన్ మరియు హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంట్రాక్ట్ మానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లు శర్మ తెలిపారు.
త్వరలో తాము ప్రకటనల కోసం అదనంగా మరో రూ. 50 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంత మార్కెట్లోకి దూసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. |