సెమీకండక్టర్ పరికరాల పరిశ్రమ ముందు ముందు వృద్ధి చెందనున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు అట్టడుగుకు పడిపోయిన ఈ పరిశ్రమ 2009 రెండో త్రైమాసికంలో మాత్రం స్వల్పంగా పుంజుకుంది. దీని ప్రకారం.. ప్రతి త్రైమాసికానికి సెమీకండక్టర్ పరికరాల పరిశ్రమ వృద్ధి చెందనున్నట్లు గార్ట్‌నర్ నివేదిక వెల్లడించింది.
ఇక మిగిలిన సంవత్సరం.. అలాగే 2010లోను ఈ పరిశ్రమగా భారీగా వృద్ధిని నమోదు చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్వల్ప కాలంలో తగ్గిన సెమీకండక్టర్ ధరలు, అదే సమయంలో విక్రయాలు పడిపోవడంతో దీని ప్రభావం పరిశ్రమపై బాగా ప్రభావం చూపాయని అంచనా వేస్తున్నారు.
విస్తృతంగా పెరిగిన పరిశ్రమ సామర్థ్యంపై దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం మరో ప్రధాన కారణంగా తెలిపారు. అదలా ఉంచితే.. 2008లో ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరికరాల పరిశ్రమలో 44 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు ఖర్చు చేశారు.
అయితే 2009లో 44.8 శాతం మేరకు తగ్గించి 24.3 బిలియన్ డాలర్ల మాత్రమే పెట్టుబడులు చేయగలిగారు. కానీ 2010లో మాత్రం ఈ పెట్టుబడులు.. 20.9 శాతం మేరకు వృద్ధి చెంది 29.4 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. |