ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ అయిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఈ ఏడాది ఆఖరు కల్లా భారత్ మార్కెట్లోకి 50 రకాల కొత్త హ్యాండ్‌సెట్‌లను విడుదల చేయనుంది. శరవేగంగా వృద్ధి చెందుతున్న జీఎంఎస్ మొబైల్ టెలీఫోనీ మార్కెట్లోకి ఈ ఏడాది ఆఖరు కల్లా ఈ ఎల్‌జీ కొత్త హ్యాండ్‌సెట్లు రానున్నాయి.సింగపూర్‌లో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ మొబైల్ కమ్యూనికేషన్ కంపెనీ (ఆసియా పసిఫిక్ ప్రాంతం) ప్రధాన అధికారి బో హెచ్ చోయ్ విలేకరులతో మాట్లాడారు. మొబైల్ టెలీఫోనీ మార్కెట్లో తమ షేర్‌ను రెండు రెట్ల వృద్ధితో 11 శాతం మేరకు పెంచాలని చూస్తున్నట్లు తెలిపారు. 2008 తో పోల్చుకుంటే ఈ ఏడాదిలో తాము విడుదల చేస్తున్న మొబైల్ హ్యాండ్‌సెట్లు రెండు రెట్లు అధికమన్నారు. కాగా, దక్షిణాకొరియాకు చెందిన ఈ కంపెనీ.. ఇప్పటి వరకు జీఎంఎం విభాగలో 5.25 శాతం షేర్‌ను కలిగి ఉంది. అలాగే సీడీఎంఏ విఫణిలో 50 శాతం వరకు మార్కెట్ వాటా కలిగి ఉంది.ఇటీవలే కమ్యూనిక్ ఆసియా 2009 టెలికమ్యూనికేషన్‌ల సదస్సులో ఎల్‌జీ కంపెనీ.. క్రిస్టల్ జీఎం 730 వంటి మూడు కొత్త మోడల్ ఫోన్‌లను విడుదల చేసింది. ఈ సదస్సులో పాల్గొన్న సందర్భంగా చోయ్ మాట్లాడుతూ, తాము పెట్టుబడులు చేసే కీలకమైన దేశాల్లో భారత్ ప్రధానమైనదిగా తెలిపారు. అదలా ఉంచితే.. అంతర్జాతీ మొబైల్ టెలిఫోనీ విక్రయాల్లో నోకియా, శామ్‌సంగ్ కంపెనీల తర్వాత ఎల్‌జీ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మోటారోలా, సోనీ ఎరిక్సన్‌లు ఉన్నాయి. |