దేశీయ ప్రభుత్వ టెలికాం రంగ దిగ్గజం భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్.. భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బాండ్ సౌలభ్యంతో అతి తక్కువ ధరల్లో పర్సనల్ కంప్యూటర్లను అందించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు హెచ్‌సీఎల్ తెలిపింది.
నేషనల్ బ్రాడ్‌బాండ్ పెనెట్రేషన్ కార్యక్రమం (ఎన్‌బీపీపీ)లో భాగంగా.. హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, బీఎస్ఎన్ఎల్ ఈ చౌకధరల పీసీలను అందించేందుకు ముందుకు వచ్చాయి. మొదటి చెల్లింపు కింద రూ. 2,250లు చెల్లిస్తే చాలు. ఆ తర్వాత నెలకు రూ. 300 చొప్పున మూడు నుంచి ఐదేళ్లలోపు మిగితా మొత్తం చెల్లించేలా పథకం రూపొందించారు.
అలాగే నెలకు రూ. 99 లేదా రూ. 150 చొప్పున చెల్లించేలా బ్రాడ్‌బాండ్ ప్యాకేజీని కూడా ప్రణాళిక చేశారు. కంప్లీట్ సొల్యూషన్ ఆఫర్‌తో పీసీ మరియు బ్రాడ్‌బాండ్ విక్రయాలను మరింతగా పెంచడమే కాకుండా.. దేశంలోని అంతర్గతంగా ఉన్న కొత్త మార్కెట్లను సృష్టించడమే ధ్యేయంగా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిసింది.
కాగా, గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ అందించేందు కోసం డాట్ ఆధ్వర్యంలో.. యూనివర్శల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) రూ. 1,500 కోట్ల నిధులను బీఎస్ఎన్ఎల్‌కు రుణంగా ఇవ్వనున్నారు.
మరోవైపు.. దేశంలోని 4వేల పట్టణాల్లో 11 స్థానిక భాషల్లో మొత్తం హెచ్‌సీఎల్ తన సేవలు, మౌళికసదుపాయాలను అందిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో సైతం హెచ్‌సీఎల్ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 505 సేవల కార్యాలయాలు, 390 వేర్ హౌస్‌లు, 150 రిపేర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ మరియు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.